పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-01 ముఖారి సం: 04-453 దేవుడు-జీవుడు

పల్లవి:

పట్టినవ్రతము నీవే పరిపాలింతువుగాక
బట్టిబయలింతే నేను బలిమున్నదా

చ. 1:

దేవ నీవు మనసు సోదించఁగా నే ధీరుఁడనై
ఆవలఁ జలించకుండే యంతవాఁడనా
పూవు వంటి చిత్త మింతే పొల్లువంటికాయ మింతే
భావించ నిందులఁ బస వున్నదా

చ. 2:

అంతరాత్మవై నీవు యటు మరఁగులుసేయ-
నంతనె నినుఁ దెలిసే యంతవాఁడనా
గంతివంటిగుణ మింతే గాలివంటిప్రాణ మింతే
యింతరట్టుసేయ నిందు నెడమున్నదా

చ. 3:

మచ్చిక శ్రీ వేంకటేశ మాట నీవై యుండఁగాను
అచ్చపు నిన్ను నుతించే యంతవాఁడనా
గచ్చువంటియిహ మింతే గనివంటి పర మింతే
ముచ్చట కిందుకుఁ దుద మొద లున్నదా