పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-04 శంకరాభరణం సం: 04-445 శరణాగతి

పల్లవి:

కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
అదె యాతనికె శరణంటే నంటి నేను

చ. 1:

యెవ్వని వుదరమున నిన్నిలోకములుండు
యెవ్వని పాదము మోచె నిల యలను
యెవ్వఁడు రక్షకుఁ డాయ నీ జంతుకోట్లకు
అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు

చ. 2:

సభలో ద్రౌపదిఁ గాచె సర్వేశుఁ డెవ్వఁడు
అభయహస్త మొసంగె నాతఁ డెవ్వఁడు
ఇభవరదుఁ డెవ్వఁడు యీతనికే వొడిగట్టి
అభినవముగ శరణంటే నంటి నిప్పుడు

చ. 3:

శరణుచొచ్చిన విభీషణుఁ గాచె నెవ్వఁడు
అరిది యజునితండ్రి యాతఁ డెవ్వఁడు
యిరవై శ్రీ వేంకటాద్రి యెక్కి నాతఁ డితఁడే
ఆరసి యితనికే శరణంటే నంటి నిప్పుడు