పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-05 గుండక్రియ సం: 04-408 అంత్యప్రాస

పల్లవి:

వెరగుతో మరచితే వెనక లేదు
కరి వరదుఁడే తక్క గతి యొండు లేఁడు

చ. 1:

ఆస విడిచినఁగాని యధిక సుఖము లేదు
యీసు విడిచినఁగాని యిహము లేదు
వాసి విడిచినఁ గాని వైపగు విరతి లేదు
వాసు దేవ భక్తిఁగాని వరముక్తి లేదు

చ. 2:

చలము మానినఁగాని సాత్వికగుణము లేదు
పలుశంక వోకకాని ఫలము లేదు
సిలుగింద్రియాల గెలిచినఁగాని త్రోవ లేదు
జలజాక్షుచింతఁగాని సమబుద్ధిలేదు

చ. 3:

దైవము కరుణనెకాని తగువిజ్ఞానము లేదు
భావించి చూచినఁగాని బలిమి లేదు
యీవల శ్రీ వేంకటేశుఁ డితడె దైవ మితని
సేవించినంతఁగాని సిద్ధి మరి లేదు