పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-04 సామంతం సం: 04-407 మాయ

పల్లవి:

బాపు బాపు దేవుఁడా పంతపు వోమనసా
వోపెఁగా యిందుకు జీవుఁ డోహో నామాయ

చ. 1:

నిన్నటిదినము నేఁడు నిజమో కల్లో
కన్నులఁ గన్నట్లాయఁ గానఁగరాదు
యెన్నఁగ రేపటిదిన మేమో యెట్లో
వున్నట్టు దెలియఁగరాదు వోహో నీమాయ

చ. 2:

బాలఁనాటి పుట్టుగిది భ్రమయో నిజమో
గాలినె కాలముఁ బోయ కతలాయను
యీలీల మీఁదిమరణ మేమో యెట్టో
వోలిఁ దెలియఁగరాదు వోహో నీమాయ

చ. 3:

నెక్కుఁ మింగినకడి నిజమో కల్లో
గక్కున రుచియుఁ దోచె కానఁగరాదు
యెక్కువ శ్రీ వేంకటేశ యిన్నియు వీదాసుఁడైతే
వొక్కటఁ గానఁగవచ్చు నోహో నీమాయ