పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-02 భూపాళం సం: 04-405 నామ సంకీర్తన

పల్లవి:

ఇవియే పో ప్రద్యుమ్న యిహ పర సాధనము
భవ జలధుల తేప పరమయోగులకు

చ. 1:

వామన గోవింద విష్ణు వాసుదేవ హరి కృష్ణ
దామోదరాచ్యుత మాధవ శ్రీధరా
నీమహిమ గానలేము నిన్నెంచఁగలేము నీ -
నామజపమే చాలు నాలుక సులభము

చ. 2:

అనిరుద్ధ పురుషోత్తమాధోక్షజ ఉపేంద్ర
జనార్ధన కేశవ సంకర్షణా
నినుఁ దలఁచఁగ లేము నిన్నుఁ దెలియఁగ లేము
నునుపై నీనామమే నోటికి సులభము

చ. 3:

నారాయణ పద్మనాభ హృషీకేశ
నారసింహ మధుసూదన త్రివిక్రమ
నీరూపు భావించలేము నిక్కపు శ్రీ వేంకటేశ
ఆరయ నీనామజప మన్నిటా సులభము