పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-06 పాడి సం: 04-398 విష్ణు కీర్తనం

పల్లవి:

అమ్మే దొకటియును యసిమలోదొకటి యని
కమ్ముకొని నీయందే కలిగె నీమాఁట

చ. 1:

సరవితో నిను నుపనిషద్వాక్యములయందు
పురుషోత్తముడవనుచుఁ బొగడఁగాను
అరిది నారాయణివియై యమృత మొసఁగుచో
అరయ శ్రుతిదె విరోధంబాయ నీమాఁట

చ. 2:

తలపోయ ధర్మసంన్థాపనుఁడవని నిన్ను
చెలరేఁగి శాస్త్రములు చెప్పఁగాను
తలఁక కిటు గోప పరదారగమనము నీవు
యిలఁ జేయ శాస్త్రవిరహితమాయ నీమాఁట

చ. 3:

వైకుంఠపతి వనుచు వడిఁ బురాణములెల్ల
యేకమొకటే వశియించఁగాను
యీకడ శ్రీ వేంకటేశ్వరుఁడవైతి విదె
చేకొలఁది నిటు నీకె చెల్లు నీమాఁట