పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-05 బౌళి సం: 04-397 శరణాగతి

పల్లవి:

నిచ్చలూ లోకము చూచి నివ్వెరగయ్యీ నాకు
చెచ్చెర శ్రీ హరి నీ చిత్తము నాభాగ్యము

చ. 1:

జీవ మతిసూక్ష్మము చిత్తము చంచలము
భావము నిరాకారము భవమెల్ల నెయ్యము
యే విధులఁ బొరలెనో యిది నాబ్రదుకు
దేవుఁడ నీచిత్తము నాతేఁకువైన భాగ్యము

చ. 2:

వూరుపెల్ల గాలి నా వుపమెల్ల మాయ
కూరిమెల్ల మొరఁగు నా గుణము విచారము
నేరుపేదో నేరమేదో నిజము దెలియదు
శ్రీ రమణుఁడవు నీ చిత్తము నా భాగ్యము

చ. 3:

కాలము పారేటిదాడి కాయము తూంట్లబొంత
ఆలరి శ్రీ వేంకటేశ యది నీచేఁత
యేలాగు లెరఁగను యిటు నీ శరణనుటే
శీలము నాకు నీ చిత్తము నా భాగ్యము