పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-04 రామక్రియ సం: 04-342 జానపదము

పల్లవి:

సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత -
చందమాయఁ జూడరమ్మ చందమామపంట

చ. 1:

మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్నుఁగొనచూపులపంట
వినువీధినెగడినవెన్నెలలపంట

చ. 2:

వలరాజుపంపున వలపువిత్తినపంట
చలువై పున్నమనాఁటి జాజరపంట
కలిమికామినితోడ కారుకమ్మినపంట
మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట

చ. 3:

విరహులగుండెలకు వెక్కసమైనపంట
పరగ చుక్కలరాసిభాగ్యముపంట
అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట
యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట