పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-01 సామంతం సం: 04-333 నామ సంకీర్తన

పల్లవి:

సర్వేశ్వరుఁడే శరణ్యము
నిర్వాహకుఁ డిన్నిటఁగాన

చ. 1:

బలుదేవతలకు బ్రహ్మాదులకును
జలజనాభుఁడే శరణ్యము
అలరిన బ్రహ్మండ మవిసిననాఁడును
నిలిపె నాతడిన్నిటిఁగాన

చ. 2:

అనేకవిధముల నిఖిలజీవులకు
జనార్దనుఁడే శరణ్యము
అనాథనాథుఁ డంతరాత్మకుఁడు
అనాదిపతి యితఁ డటుగాన

చ. 3:

తగునిశ్చలులగు తనదాసులకును
జగదేకపతే శరణ్యము
చిగురుఁజేవయగుశ్రీవేంకటేశుఁడు
అగువరములొసఁగు నటుగాన