పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-06 ముఖారి సం: 04-326 వైరాగ్య చింత

పల్లవి:

చవి నోరి కేడఁ దెత్తు సంప దేడఁదెత్తు వీని
సవరించుటే నాసంప దిదిగాదా

చ. 1:

పచ్చడా లెక్కడఁ దెత్తు పట్టుచీర లేడఁ దెత్తు
వెచ్చనిండ్లేడఁ దెత్తు వెంట వెంటను
తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట
వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా

చ. 2:

దొరతన మేడఁ దెత్తు దొడ్డసొమ్ము లేడఁ దెత్తు
యెరవులసిరుల నేనేడఁ దెత్తు
వెరవున నేనెవ్వరిని వేసరించఁజాలక
దరిచేరుటే దొరతనమిదిగాదా

చ. 3:

తోడఁబుట్టువుల నేడఁ దోడితెత్తుఁ జుట్టాల -
నేడఁ దెత్తు సుతులపొందేడఁ దెత్తును
వేడుకైనపొందు శ్రీవేంకటేశుఁ దలఁచుటే
ఈడులేనిబంధుకోటి ఈతఁడెకాఁడా