పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-05 సాళంగనాట సం: 04-319 శరణాగతి

పల్లవి:

ఒసఁగితివిన్నియు నొకమాఁటే
వెస నిఁకఁ జేసే విన్నపమేది

చ. 1:

నారాయణ నీనామము దలఁచిన -
నీరానివరములిచ్చితివి
చేరి నిన్ను నిటు సేవించిననిఁకఁ
గోరి పడయ నిఁకఁ గోరికలేవి

చ. 2:

హరి నీకొకమరి యటు శరణంటే
గరిమల నన్నిటు గాచితివి
నిరతముగా నిఁక నిను నుతియింపుచు
అరగొరతనివి నిను నడిగేదేదో

చ. 3:

శ్రీవేంకటేశ్వర చేయెత్తిమొక్కిన
భావమే నీవై పరగితివి
యీవరుసల నీవింతటిదాతవు
ఆవలనినుఁ గొనియాడెడిదేమి