పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-02 గుండక్రియ సం: 04-316 మాయ

పల్లవి:

కటకట హరిమాయాకల్పనెట్టిదో
తటుకునఁ బారవేసేతలఁపెందు లేదు

చ. 1:

అనంతకోటియుగాదులనుండియు
తనివోక విషయాలఁ దగిలుండినా
దినమొక్కొక్కరుచియై తీపులై పండీఁగాని
వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు

చ. 2:

కడలేక నాలుకకుఁ గన్నయాహారములెల్ల
వోడలిలోఁ బూఁటవూఁట వొట్టుకొనినా
సడిఁ బైపై వింతవింతచవులే వెదకుఁగాని
విడువని యాత్మకు వెగ టెందు లేదు

చ. 3:

కలకాలముననుండి కాపురపు లంపటాలె
కలిమితో మెడఁగుచ్చి కట్టుకొనినా
యెలమితో శ్రీవేంకటేశ్వరునాజ్ఞల -
నలవాటైన యాత్మకలపే లేదు