పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0346-05 మాళవి సం: 04-272 హనుమ


పల్లవి :

అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు


చ. 1:

కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోన అందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు


చ. 2:

పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు


చ. 3:

వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించే హనుమంతుఁడు
అడ్డుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు