పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0346-04 శ్రీరాగం సం: 04-271 నృసింహ


పల్లవి :

అహోబలేశ్వరుఁ డఖిలవందితుఁడు
మహి తనిఁ గొలిచి మనుఁ డిఁక జనులు


చ. 1:

మూఁడుమూర్తులకు మూలం బీతఁడు
వేఁడిప్రతాపపు విభుఁ డీతఁడు
వాఁడిచక్రాయుధవరధుఁ డీతఁడు
పోఁడిమిఁ బురాణపురుషుఁ డీతఁడు


చ. 2:

అసురలకెల్లఁ గాలాంతకుఁ డీతఁడు
వసుధ దివ్యసింహం బితఁడు
విసువని యేకాంగవీరుఁ డీతఁడు
దెసలఁ బరాత్పరతేజం బితఁడు


చ. 3:

నిగిడి శ్రీవేంకటనిలయుఁ డీతఁడు
బగివాయనిశ్రీపతి యితఁడు
సొగిసి దాసులకు సులభుఁ డీతఁడు
తగు నిహపరములదాతయు నీతఁడు