పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0345-06 నాదరామక్రియ సం: 04-267 అధ్యాత్మ


పల్లవి :

దైవము దూరఁగనేల తమనేర్పు నేర మింతే
యీవలఁ దమకర్మము లెంచరు మనుజులు


చ. 1:

మొల్లమి గాలియెకటే ముంచి తూరుపెత్తుచోట
పొల్లకట్టు కడఁబడె పోగువడె గట్టివెల్లా
వుల్లములో శ్రీహరి ఒకఁడై వుండునతని-
నొల్లరైరి యసురలు వొలిసిరి సురలు


చ. 2:

మించిన జల్లి యొకటె మీఁదనుండు దొడ్డవెల్ల
చంచుల సన్నములెల్లా సందులఁ గారు
యెంచఁగ హరి యొకఁడే యెరఁగక కొందరైతే
కొంచమై రీతనిఁ గొల్చి కొందరైతే ఘనులు


చ. 3:

కోవిలలుఁ గాకులును కోరి యొక్కరీతి నుండు
యీవల వసంతవేళ నేరుపడును
శ్రీవేంకటేశ్వరునిసేవకులు మనుజుల-
భావ మొకరీతి నుండు ఫలములే వేరు