పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0344-04 గుజ్జరి సం: 04-259 వైష్ణవ భక్తి


పల్లవి :

ఏమన వచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు


చ. 1:

కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే


చ. 2:

శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే


చ. 3:

శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే