పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0340-01 మంగళకౌశిక సం: 04-232 భక్తి


పల్లవి :

మమ్ముఁజూడనేల నీమహిమే చూతువుగాక
వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటేకాదా


చ. 1:

పెక్కుమారులు నిన్నుఁ బేరుకొని జపించఁగ
మక్కళించి నీకుఁ గొంత మహిమెక్కినా
వొక్కమారు జపించి నే నూరకుండినంతలోనే
తక్కక నీమహిమలోఁ దరగి పోయీనా


చ. 2:

తగిలి నేఁ గాలమెల్ల ధ్యానము సేయఁగ నీకు
జిగి నీమేనికిఁ గింత చేవ యెక్కీనా
అగపడి యొకవేళ నటు దలఁచి మానితే
చిగురై యంతటిలోనె చిక్కి వాడీనా


చ. 3:

యిన్ని యాల శ్రీవేంకటేశ మాయింటిలోననే
వున్నతి నీవారమని వుంటేఁ జాలు
సన్నము దొడ్డించనేల సరివలసీచోట
అన్నియు నిత్యమింతే యలమట కోపము