పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0339-06 బౌళి రామక్రియ సం: 04-231 వైష్ణవ భక్తి


పల్లవి :

జ్ఞానంబొకటే జగమున కధికం మరి
నానావిధములు నటనలు


చ. 1:

బహుదానఫలము పడయుటకంటే
యిహమున వైరాగ్య మెక్కుడు
సహజకర్మములు శతములకంటే
అహిశయనుని భక్తధికము


చ. 2:

ధరఁ దపములనంతంబులకంటే
గరిమల శాంతము ఘనము
విరసాచారము వేవేలకంటే
హరినామపఠన మధికము


చ. 3:

ఆవల వ్రతములు అన్నిటికంటే
శ్రీవైష్ణవమే శేఖరము
శ్రీవేంకటేశ్వరుచేఁతలె యివిగన
సేవ యిదొకటే చింతింప ఘనము