పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0339-04 లలిత సం: 04-229 నామ సంకీర్తన


పల్లవి :

వర్ణాశ్రమములాల వడిఁ జిత్రగుప్తులాల
వర్ణించి మమ్మిఁకఁ దడవకురో మీరు


చ. 1:

చదువులు దెచ్చినట్టి సర్వేశుఁ గొలిచితి
చదువు నామారతఁడు చదివీఁ బోరో
అదన యోగీంద్రవంద్యుఁడైన కృష్ణుఁ గొలిచితి
చదల నాయోగములు సాధించు నతఁడే


చ. 2:

కూరిమి యజ్ఞకర్తైనగోవిందుఁ దలఁచితి
చేరి నామారతఁ డవి సేసీఁ బోరో
ఆరయ విజ్ఞానమూర్తియైన హరి శరణంటి
వూరకే నాకాతఁడవి వుత్తరువిచ్చీని


చ. 3:

దేవతాశిఖామణియైన దేవునిఁ బూజించితిని
దేవఋషి ఋణములు తీరిచీఁబోరో
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నవాఁడు
చేవఁ బాపాలెల్లఁ బాసె సెలవిచ్చెఁ జేతలు