పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0339-03 దేసి సం: 04-228 మనసా


పల్లవి :

లోకమంతా నిండె లోచూపు వెలిచూపు
శ్రీకాంతుఁడై తోఁచె చిక్కినవి యాలా


చ. 1:

సకలజీవులలోన సర్వేశ్వరుఁడు వాఁడె
వొకరి నౌఁగాదన నోపను నేను
అకట యాతనిచేఁతే అందరునుఁ జేసేవారే
వికటాలెందుకు నాడ వెరపయ్యీ నాకు


చ. 2:

భువియందు దీని యందు పురుషోత్తముఁడు వాఁడె
వివరించ మేలు గీడు వెదక నే నోప
చెవి విన్న మాటలెల్ల శ్రీపతియై తోఁచీని
ఇవల కల్లనిజాలు యెంచఁజాల నేను


చ. 3:

పగటందు రేయందు పరమాత్ముఁడు వీఁడె
తగిలి పాసే నన్న తలఁపునోప
జగి మించ నాలోన శ్రీవేంకటేశుఁడే
బగివాయఁ డెన్నఁడును బదుకవో మనసా