పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0336-06 సామంతం 04-213 శరణాగతి


పల్లవి :

చలువకు వేఁడికి సరికి సరి
కలదిక హరి నీ కరుణే మాకు


చ. 1:

కాయము గలిగినఁ గలుగుఁ దోడనే
పాయపుమదములు పైపైనే
రోయదు తనుఁ గని రుచులే వెదకును
యేయెడ హరి నిను నెరుఁగుట యెపుడో


చ. 2:

కడుపు నిండితే ఘనమై నిండును
బడిఁ బంచేంద్రియపదిలములు
విడువ వాసలును వెలయు బంధములు
కడగని మోక్షము గైకొనుటెపుడో


చ. 3:

పెక్కులు చదివిన పెనఁగుఁ దోడనే
తెక్కుల పలు సందేహములు
యెక్కువ శ్రీవేంకటేశ నీవె మా-
నిక్కపు వేల్పవు నీచిత్త మిఁకను