పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0336-04 పళవంజరం సం: 04-211 నామ సంకీర్తన


పల్లవి :

ఒక్కమాఁటలోనివే వొగి బంధమోక్షాలు
చిక్కినందాఁకా దేహి చింతఁ బొందీఁగాని


చ. 1:

హరి యని నుడిగి రెండక్షరాలఁ బాపేటి-
దురితాలు భూవిలోనఁ దొల్లె లేవు
పురిగొని యందుమీఁద పొంచి విశ్వాసములేక
పెరగఁగఁ బెరుగఁగ పెచ్చు రేగీఁగాని


చ. 2:

మతిలో గోవింద యన్న మాత్రమున నంటేటి
అతిపుణ్యాలిలమీద నన్ని గలవా
కతగా నట్టె మహిమగానలేక వుండగాను
బతిమాలఁగానే యింత బయలాయఁగాని


చ. 3:

శ్రీవేంకటేశ నిన్ను సేవించితే నిచ్చేటి-
యేవల వరాలు లెక్క నెంచవసమా
భావించి తెలిసి చేపట్టెడి యరుదింత
దైవము నా కియ్యఁగాను దక్కె నింతేకాని