పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0324-04 సాళంగనాట సం: 04-139 కృష్ణ


పల్లవి :

శ్రావణ బహుళాష్టమి జయంతి నేఁడు
సేవించరో నరులాల శ్రీకృష్ణుఁడిఁతఁడు


చ. 1:

భావింప వసుదేవుని పాలిటి భాగ్యదేవత
దేవకీ గనినయట్టి దివ్యరత్నము
చేవమీర సురల రక్షించే కల్పతరువు
యీవేళ జన్మించినాఁడు యిదే కృష్ణుఁడు


చ. 2:

హర విరంచాదులకు నాదిమూల కారణము
పరమమునుల తపఃఫల సారము
గరుడోరగేంద్రులకుఁ గలిగిన నిధానము
యిరవుగా నుదయించెనిదె కృష్ణుఁడు


చ. 3:

బలుయోగీశ్వరుల బ్రహ్మానందము
చెలఁగు భాగవతుల చింతామణి
అలమేల్మంగకు బతియట్టె శ్రీవేంకటాద్రి-
నీలపై జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు