పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0324-03 ధన్నాసి సం: 04-138 శరణాగతి


పల్లవి :

తొల్లిటివారు వెట్టినతోవ యిది
బల్లిదులై యిందునే బదుకుటే మేలు


చ. 1:

కలఁడు సర్వేశ్వరుఁడొక్కఁడు దిక్కందరికిని
సులభుఁడు శరణము చొచ్చితేఁ గాచు నతఁడు
బలుతపములు చేసి పాట్లఁ బడ నోప మని
బలువుఁడాతని నమ్మి బ్రదుకుటే మేలు


చ. 2:

వున్నాఁడు మనసులోనే వొక్కచో వెదకవద్దు
ఇన్నిటాఁ దలఁచుకొంటే నిచ్చు నిహముఁ బరము
కన్నచోట్ల వెదకి కడు నలయనోపము
పన్నుగ నితనిఁ గొల్చి బ్రదుకుటే మేలు


చ. 3:

శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిలుచున్నవాఁడు
సేవించిన యంతలోనే చేకొని యేలు నీతఁడు
దేవతలఁ బ్రార్ధించి తెలియఁగ నేరము
భావించితని నుతించి బ్రదుకుటే మేలు