పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0252-2 కాంబోది సం: 09-008

పల్లవి:

చెప్పినట్టె పతిపంపు సేతువు గాక
చిప్పిలుఁ జెమటలతో సిగ్గు లేఁటికే

చ. 1:

చెక్కు చేతఁ బెట్టుకోగా సెలవుల నవ్వు నీకుఁ
జిక్కె నేఁడు మరి వేరె చింత యేఁటికే
దక్కె నీకు వలపులు దండ నున్నాఁడు విభుఁడు
మొక్కలపు వెరగుతో మోన మేఁటికే

చ. 2:

నిట్టూర్పు నించఁగాను నిక్కుఁగుచములమీఁద
యిట్టి పులకలు నిందె నేఁకటేఁటికే
జట్టిగొనె వేడుకలు చనవు లాతఁడె యిచ్చె
వట్టి అలుకతోఁ దలవంచ నేఁటికే

చ. 3:

పానుపుపై నుండఁగానె బలిమి శ్రీవెంకటేశుఁ
డానుక నిన్నుఁ గలసె నార డేఁటికే
నీనోము లీడేరె నీమొగఁడు నిన్ను మెచ్చె
కోనల బొమ్మజంకెన కొస రేఁటికే