పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0298-1 శ్రీరాగం సం: 09-283

పల్లవి:

నీ కేమిటఁగడమ నీచేతిలో వాఁడతఁడు
మైకొని నీయడఁ జేసే మన్నన యెరఁగవా

చ. 1:

ఆరీతి మాటాడఁగా నిన్నౌఁ గాదనరాదు గాక
కూరిమి నీపతి యిచ్చకుఁడెకాఁడా
మేరలు మీరినచోట మెప్పించరాదుగాక
యీరాని చనవు లాతఁ డిచ్చుట యెరఁగవా

చ. 2:

కాఁతాళించివున్నవేళ కై కొలుపరాదుగాక
చేఁతల నీచెప్పినట్టు సేయఁడా తొల్లి
మోఁతతోఁ దలవంచఁగా మొగి నవ్వరాదుగాక
బాఁతిపడి యతఁడు చేపట్టుట యెరఁగవా

చ. 3:

తప్పకచూడఁగా నిన్ను తలపించరాదుగాక
యెప్పుడూ శ్రీవెంకటేశుఁ డిరవెకాఁడా
నెప్పునఁ దలవంచఁగా నేర మెంచరాదుగాక
కుప్పలుఁ దెప్పలుగాఁగ కూడుట యెరఁగవా