పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0002-1 శ్రీరాగం సం: 05-006

పల్లవి:

తగిలిన మునులే యాతనిఁ గందురంటా
మగువ యెవ్వరితోడ మాటాడదిపుడు

చ. 1:

అతులనిరాహారులతనికిఁ బ్రియులంటా
అతివ నిన్నటినుండి యారగించదు
తతి నడవులనుండే తపసులే యతనికి
హితులంటా వనములో నెడయదీతరుణి

చ. 2:

తలకొన్న యతనిపై తలఁపే పరమంటా
చెలియ చెక్కిటనున్న చెయి దియ్యదు
వలనైన యతఁడు దేవతల కొడయఁడంటా
కలికి రేయిఁబగలు కనుముయ్యదిపుడు

చ. 3:

అడరి జలములోన నతఁడుండునంటా
వడియుఁ జెమట దుడువదు మేనను
కడు మంచియతఁడు వేంకటగిరిభుఁడంటా
పడఁతి యాతనినె గుబ్బలనొత్తీ నిపుడు