పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0007-6 సామంతం సం: 05-043

పల్లవి:

అప్పుడే నే నీకు మోహపుటాలనై తినా
కప్పకు నీ చేఁత లంతకంటెఁబో నేను

చ. 1:

ఇంచుకంత పనికైన నిల్లుచొరనీక నిన్ను
లంచములడుగను నే లకిమమ్మనా
వంచనల నీకు నిట్టె వలలఁ జిక్కితిఁ గాక
కంచుఁ బదనునకంత కంటెఁబో నేను

చ. 2:

సొలపు మాటల నిట్టే చూపులనె జంకించి
చలము సాదించ నీ సత్యభామనా
వలచి నేనిదె నీకు వసమై చిక్కితిఁగాక
కలికి చేఁతలనంత కంటెఁబో నేను

చ. 3:

రేపు మాపు గోరఁ దమ్మి రేకులనే లేఖవ్రాసి
రూపు నీకు జెప్పిపంప రుకిమిణినా
తీపుల నిన్నుఁ గూడి తిరువేంకటేశ విరిఁ
గైపు సేయఁగాని అంతకంటెఁబో నేను