పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0092-5 కాంబోది సం: 05-366

పల్లవి:

ఎవ్వతిర ప్రియము నీకింత నేసినది చూచి
దవ్వుల నిన్నొకమాఁట తగులనాడినది

చ. 1:

సిబ్బెంపు గుబ్బలమీఁది జిలుగుఁ బయ్యదది
గబ్బిచూపు నిన్నుఁ జూచి కన్నుల నవ్వినది
బబ్బిలికాయలతోడి పసిఁడిమెట్టెలది
జొబ్బిలిన చెమటలచేఁ జొక్కి నిలిచినది

చ. 2:

తొంగలిరెప్పలతోడి తోరపుఁ గన్నులది
చెంగటిచెలియచేతఁ జెయివేసి నవ్వినది
చెంగలువబంతిచేతఁ జెక్కునొక్కినది
వుంగరాలవేళ్ళ నీ కొయ్యనె మొక్కినది

చ. 3:

వీడక వీడని కొప్పువిరులు జారినది
వాడక వాడని మోవివన్నెలు దోఁచినది
యీడులేని తిరువేంకటేశ నినుఁబొంది యీ-
కోడెవయసున నింతి కోరికెలందినది