పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0092-4 కాంబోది సం: 05-365

పల్లవి:

వలుపేడఁ గలిగెనే వామలోచనకు దీని
వలపించినటువంటివాఁ డింకనెవ్వఁడో

చ. 1:

సిరులు గల మోమెల్ల చిరునవ్వుగనుదోయి
విరివైన వురమెల్ల వేఁకమైన గుబ్బలు
తరుణికి వెనకెల్లఁ దురుము పిఱుఁదులును మంచి-
నిరతంపు నడపెల్ల నిండుమురిపెములు

చ. 2:

జలజాక్షినిలువెల్ల చక్కఁదనముల పోగు
కలికితనమెల్లఁ గన్నులపండువు
కలకంటివయసెల్ల గడుఁ గోమలము దీని-
పలకుఁదేనియలెల్ల పంచదారకుప్పలు

చ. 3:

చెలువైన మోవెల్ల చిలుకవోట్లు దీనిఁ
కలదేహమింతయునుఁ గస్తూరివాసనలు
అలరించెఁ దిరువేంకటాధీశ్వరుఁడు దీ ని-
తలఁపెల్ల విభునిలో దాఁగున్న కరువు