పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0091-2 భైరవి సం: 05-357

పల్లవి:

ఎవ్వతెరా నినుఁజూచె నేమని పుత్తెంచె
పువ్వుబంతి నిను వేసి పొందుచూపి మొక్కినది

చ. 1:

వీడియు వీడని కొప్పు వేఁగున వీఁగుచు మాట -
లాడియు నాడక చెలినల్లన దూరినది
వాడియు వాడని తమ్మివంటిమోము గలది తాఁ
జూడక చూచిన వాలుఁజూపుల బిత్తరిది

చ. 2:

జారియు జారని గుబ్బచన్నుల పయ్యెదది లో-
నారియు నారని కోపమైన మోహముది
పేరియుఁ బేరనికాఁక- బెచ్చువెరిగినది తాఁ
జేరియుఁ జేరక నీ చేరువ దాఁగినది

చ. 3:

మాట లాడుచును మోవి మఱఁగు నేసినదొక-
పూఁటలోనె నీ కౌఁగిటి పొందులనుబ్బినది
యేఁటికిరా తిరువేంకటేశుఁడ బొంకఁగ నీ-
నాటకపు బ్రియముతో నన్నుఁ గలసితివి