పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0090-6 శ్రీరాగం సం: 05-355

పల్లవి:

ఎట్టు ధరియించెనో యీ యింతి హృదయంబు
పట్టనెట్లోపునో ప్రాణవాయువులు

చ. 1:

వడియుఁ జెమటలనుఁ దుడువఁ గరాని పన్నీట
తడియుఁ బయ్యదయుఁ దత్తరమందు మనసు
సుడియుఁ దమకములచే సొలయు నలపుల మేన
విడియుఁ బులకలు చూడ వెరగైన మోము

చ. 2:

మురియుఁదలఁపులును జలమునఁబొదలు మదనాగ్నిఁ
నురియుదేహంబు గడు నుదుటుఁగోరికలు
విరియు మానంబు నరవిరి సొలపుమాఁటలునుఁ
గురియు మోహజలంబు కొదలుఁజూపులును

చ. 3:

వెదచల్లునూర్పులును వెలితైన నవ్వులును
సదమదంబైన పలుచనిమేనిపూఁత
అదన శ్రీ తిరువేంకటాద్రీశు కౌఁగిటను
గదిసి యింపులఁ బొదలఁ గలిగె నీ చెలికి