పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0086-5 శ్రీరాగం-రచ్చెతాళం సం: 05-330

పల్లవి:

కనలకువే మతి కలఁగీని యీ-
వనజోదరుఁడిదె వచ్చీనిపుడు

చ. 1:

వడిఁ గుచభరమున వ్రాలెడి వేగము
నడవకువే సన్నపు నడుము
చిడుముడి నన్నుఁ జేసిన గోవిందుఁడు
తడయఁడు నిన్నుఁ దగిలీనిపుడు

చ. 2:

కొప్పువేఁగుననె కుదిసిన మెడ గడు-
తిప్పకువే కందెడి సరులు
దప్పివొదలఁ బరితాపము నీమై
కప్పిన శ్రీహరి గదిసీఁ గాని

చ. 3:

పొరలుచు నిట్టూర్పులను సురనియెదు
వెరవకుమెన్నఁడు వేదనల
కరఁగి నీవు వేంకటపతికౌఁగిట
మెరసితివిటు కడు మించిన రతుల