పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0086-1 ఆహిరి సం: 05-326

పల్లవి:

జట్టిగొనెర నిన్ను జవరాలు
చిట్టంటు చేఁతల జెలఁగితివపుడు

చ. 1:

వాలుకచూపులు వాడఁగ నాటక-
సాలలోన నిను జవరాలు
చాలుగ మురియుచు సరుగనఁ జివుకన
కాలఁ జిమ్మినను కలఁగితివపుడు

చ. 2:

సొలపుగొనుచు మించుల మొలనూళ్ళ
సళుపుల మురిపెపు జవరాలు
గలగల గజ్జెలు గదలఁగ నునుఁదొడ
బలిమిఁ గదలిచిన బ్రమసితివపుడు

చ. 3:

సొంపగు తల చంచుల మునివేళ్ళ-
సంపద నడపుల జవరాలు
యింపులు నెరవుచు నిటె నినుఁ గదిసిన
కంపించితి వేంకటగిరిరమణ