పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0084-1 సామంతం సం: 05-314

పల్లవి:

ఎచ్చరించెదననిన యీజగంబనఁగాను
సచ్చరిత్రుఁడ నీకు సరకా వోరి

చ. 1:

రుచుల నారాయణ పరో జ్యోతి యని
పచరించి నిను శ్రుతులు పలుకఁగాను
వచియింపరాని యిటువంటి నీ యెదుట నా-
కుచకుంభములకాంతి కొలుపునా వోరి

చ. 2:

రమణ నారాయణ పరబహ్మమని
ప్రమదమున నిను శ్రుతులు పలుకఁగాను
తమకమున నను నీవు తగిలితివి యీసుఖము
నిమిషమాసుఖము గానేర్చువా వోరి

చ. 3:

అరయ నారాయణ పరాత్పరంబని నిన్ను
సరసవిద్యలు శ్రుతులు చాటఁగాను
సిరుల ననుఁగూడితివి శ్రీ వేంకటేశ నీఁ
కరుణకిటు నేనోర్వఁగలనా వోరి