పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0081-1 లలిత సం: 05-295

పల్లవి:

తెప్పగా మఱ్ఱేకుమీఁదఁ దేలాడువాఁడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాఁడు

చ. 1:

మోఁతనీటి మడుగులో యీఁతగరచినవాఁడు
పాఁతగిలే నతికిందఁబాయనివాఁడు
మూఁతి దోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాఁడు
రోఁతయైన పేగుల పేరుల గలవాఁడు

చ. 2:

కోడికూఁతనోరివాని కుఱ్ఱతమ్ముఁడైనవాఁడు
బూడిది పూసినవాని బుద్దులవాఁడు
మాడవన్నె లేటివెంట మాయలఁ దగిలినవాఁడు
దూడల నావులఁ గాచి దొరయైనవాఁడు

చ. 3:

ఆకసానఁ బారేవూరి అతివల మానములు
కాకు సేయువాఁడు తురగముపైవాఁడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణిఁ గూడి
యేకాలముఁ బాయని యెనలేనివాఁడు