పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0071-6 ముఖారి సం: 05-240

పల్లవి:

ఎంత నేరఁడీదైవమిందరికి
బ్రాంతి గడుఁ బుట్టించి పరము మరపించె

చ. 1:

ప్రాయమనియెడి మహాబహురూపమిది యొకటి
కాయములఁ గరఁగించీఁ గళలనెక్కించి
సోయగంబగు కన్నుచూపులనియెడు మహ-
మాయములఁ బొరలించి మనసు నాటించె

చ. 2:

చక్కఁదనమనెడి వేషంబొకటి మేనిపై
నిక్కించి యది గోర్కి నెలవుగాఁ జేసి
తక్కువలు నెక్కువలు తమకములు నొల్లములు
మక్కువలు గలిగించి మల్లువెనఁగించె

చ. 3:

ఇట్టి మోహము వేంకటేశ్వరుఁడు దనమీఁదఁ
బెట్టించుకొనె నయినఁ బ్రేమగల ఫలము
నెట్టుకొని తానతని నిజమెఱిఁగి మేలు చే-
పట్టెనైనను జన్మపరుఁడైన ఫలము