పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0004-6 భైరవి సం: 05-023

పల్లవి:

వనితభాగ్యంబు దేవరచిత్తము మాకు
బనిగాదు యింక నీ పాదంబులాన

చ. 1:

అడబాలసతి బోనమారగించు మటంచు
బడి బడిని కడు విన్నపము సేయఁగా
ఉడుగని పరాకుతో నుండి నెచ్చెలి మీఁద
బడలి వొరగినది నీ పాదంబులాన

చ. 2:

అడపంబుపతి వీడెమవధరింపుమటంచు
అడరి కప్పురపుఁ బలుకందీయఁగా
కడకంటఁ జూడదిదె కాఁతాళమో మరపొ
పడఁతి యిప్పుడు నీ పాదంబులాన

చ. 3:

ఆలవట్టము విసరు అతివలను వలదనదు
పాలిండ్లపై కొంగు పచరించదు
యేలాగవునొ వేంకటేశ నీవిపుడిట్టె
పాలించకున్న నీ పాదంబులాన