పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0069-6 సామంతం సం: 05-228
పల్లవి:

చల్లనై కాయఁగదొ చందమామా నీ
వెల్లగాఁ దిరువేంకటేశునెదుర
మొల్లమిగ నమృతంపు వెల్లి గొల్పుచు లోక-
మెల్ల నినుఁ గొనియాడఁగాను

చ. 1:

పొందైన హితులు నాప్తులు రసికులును గవులు
నందమగు నునుమాటలాడ నేర్చిన ఘనులు
చిందులకు నాడేటి సీమంతినీ మణులు
చెలఁగి యిరుగడఁ గొలువఁగాను

చ. 2:

వందిమాగదులు గైవారింపఁ దనదివ్య-
మందిరోపాంత ఘనమార్గమునఁ గోనెటి-
ముందటను మంద మందప్రయాణములతోఁ
నిందిరాపతి మెరయఁగాను

చ. 3:

ఏకాంత ముఖగోష్టినింపొంద మానవా-
నీకంబులెడఁ గలసి‌ నిలిచి సేవింపఁ గాం-
తాకదంబముల హస్తముల కంకణఝణ-
త్కారములు నిగుడఁ జామరములిడఁగ

చ. 4:

జోకైన మణిగణస్తోమాంకితంబులై
సొంపొందు నాలపట్టములు గరములఁ దాల్చి
యేకాంతులిరువంక నెదిరి కొలువఁగ సకల-
లోకేశ్వరుఁడు మెరయఁగాను

చ. 5:

బంగారుపత్రిమలకు ప్రతులైన దివిజలోఁ
కాంగనలు ఘనవిమానాంగణంబుననుండి
చెంగలువలును మంచిసేవంతిరేకులను
చెలఁగి యిరుగడఁ జల్లఁ గాను

చ. 6:

మంగళాత్మకములగు మహితవేదాంత వే-
దాంగవిద్యలకు ప్రియమంది చేకొనుచుఁ దిరుఁ
వేంగళేశ్వరుఁడు గడు వేడుకలతోడఁ దిరుఁ
వీథులను విరించఁగాను