పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0067-6 ముఖారి సం: 05-216

పల్లవి:

ఎండలు రేయెండలుగా నిరువంకఁజూచువాఁడు
కొండలుఁ గోట్లునయిన గుణములవాఁడు

చ. 1:

పాలవెల్లి కొండమీఁదఁ బల్లెగట్టినవాఁడు
పాలలోని పాపఁడన్న ప్రాణమైనవాఁడు
పాలఁ బుట్టినట్టికూడు పంచిపెట్టినవాఁడు
పాలునేయి ముచ్చిలించి బదికినవాఁడు

చ. 2:

అలపోతువానితోడ నంటినమేనివాఁడు
ఆలఁగాపరులతోడ నాడినవాఁడు
ఆలజాలమైన నీటనలరఁ దేలినవాఁడు
ఆలపోతు కొండమీఁద ననువైనవాఁడు

చ. 3:

పాఁపరేని మేను దన పానుపు వేసినవాఁడు
మోఁపరయి సకలము మోచినవాఁడు
కోపము శాంతములేని కొండలకోనేటివాఁడు
పాపముఁ బుణ్యము లేక బదికినవాఁడు