పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0067-4 ముఖారి సం: 05-214

పల్లవి:

కొలవిలోన మును గోపికలు
మొలక నవ్వులతో మ్రొక్కిరి నీకు

చ. 1:

పిరుఁదులు దాఁటిన పించెపుటలకల
తురుములు వీడఁగఁ దొయ్యలులు
అరిదినితంబములందునె దాఁచుక
మురిపెపుఁ గరముల మొక్కిరి నీకు

చ. 2:

నిద్దపు మానము నెలఁతలు లోఁగుచు
గద్దరి తొడలనె కట్టచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మొక్కిరి నీకు

చ. 3:

పాలిండ్ల పెనుభారంబుల కర-
మూలపు మెఱుఁగులు ముంచఁగను
వేలపుఁ బ్రియముల వేంకటేశ నిను
మూలకుఁ బిలుచుచు మొక్కిరి నీకు