పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0067-3 ముఖారి సం: 05-213

పల్లవి:

వన్నెమాటల వలతువా నీవు నామనసు
కన్న పెట్టఁగఁ గదా కడుబేలనైతి

చ. 1:

పట్టుకొని నిన్నుఁ గోపముదీర చూపులనె
కట్టివేసినఁగదా గర్వమడఁగు
అట్టునిట్టును నీకు నయ్యలునసాదలును
బెట్టెకా నీచేతఁ బిరివీకులైతి

చ. 2:

మరిగించి నిన్ను నా మనసారఁ గుచగిరుల-
చరులఁ దోసినఁ గదా చలమణఁగును
అరిది మోహమున నీ యడుగులకు మడుగులేఁ
బరచికా విరహతాపమునఁ బడవలసె

చ. 3:

చెనకి నిన్నిట్ల నాచేయారఁ గోరికల
తనివి దీర్చినఁగదా తగులవదువు
ఘనమూర్తివైన వేంకటగిరీశ్వర నీకు-
నొనర లోనైకదా వొడలెరఁగనైతి