పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0066-4 ముఖారి సం: 05-208

పల్లవి:

వెరవకువే యింత వెరగేలా నీకు
నెఱిఁ గురిసీఁ గొప్పున నీలాలు

చ. 1:

పగడాలు వాతెరఁ బాయక కురియఁగ
మొగిఁ గురిసీఁ గన్నుల ముత్యాలు
మగువ నీవిభుని ప్రేమపుఁగూటమి గన్నుల
మగుడఁ గురిసీ నింక మాణికాలు

చ. 2:

పడఁతి నీపుట్టానఁ బచ్చలు గురియఁగా
వడిసీని నీమేన వజ్రాలు
కడఁగి నీరమణుని కాఁకలఁ గూడఁగ
తొడరీ నీగోళ్ళతుదఁ గెంపులు

చ. 3:

హితవైన తిరువేంకటేశుకౌఁగిట మోహ-
రతులఁ బొడమె నవరత్నాలు
ప్రతలేని లప్పలైన పచ్చి కస్తూరి శయ్య
మితిలేక రాలెనే గోమేధికాలు