పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0064-3 శంకరాభరణం సం: 05-195

పల్లవి:

లేఁతచెమటలనె తెలిసె మాకు నీకు
నీఁతలు మోఁతలునైన యింటిలోని సాము

చ. 1:

పొదలు నీ నిట్టూరుపులనె తెలిసె మాకు
తుద మీరు వలరాచతొలిసాము
చెదరు నీ నెరులు చూచిననె తెలిసె మాకు
వెదచలు కాఁకల విరహపు సాము

చ. 2:

పొలిఁతి నీ చూపువంపులనె తెలిసె మాకు
తలపోఁతవగల బిత్తరిసాము
పలుకకుండిన నీ కోపాననె తెలిసె మాకు
అలవోక నగవు నీ అరవిరిసాము

చ. 3:

వొద్దికఁ గస్తూరితావులనె తెలిసె మాకు
గద్దరి నీ రతుల చీఁకటిసాము
ముద్దుల నీ నగవుల మోమునఁ దెలిసె మాకు
నిద్దపు వేంకటపతి నెరపిన సాము