పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0064-1 శంకరాభరణం సం: 05-193

పల్లవి:

నాకుఁ జెప్పరె వలపు నలుపో తెలుపో
నూకి పోవఁగరాదు నుయ్యా కొండో

చ. 1:

పొలఁతి మరునికి వెరవ పులియా యెలువో
వులుకుఁదుమ్మిదమోఁత వురుమో మెరుమో
తిలకింపఁ జందనము తేలో పామో
యెలమిఁ గోవిలకూఁత యేదో పోదో

చ. 2:

పొదలిన చలిగాలి పొగయో వగయో
వదలిన కన్నీరు వాఁగో వంతో
వుదరమునఁ బన్నీరు వుడుకో మిడుకో
యెదుటఁ దలవంచుకొనుటెగ్గో సిగ్గో

చ. 3:

అసమశరుపై పరపుటదనో పదనో
పసగలవానిమోవి పంచదారో తేనో
అసమగతి వానిరాక ఆదోపాదో
రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో