పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0030-5 పాడి సం: 05-171

పల్లవి:

మారుకు మారు సేయ మఱచి నీ వంతలోనె
నేరములెంచుకొనేవు నేఁటిలోనే తప్పెనా

చ. 1:

చొక్కపు నీ గుబ్బలపై జూజపు నేఁతలవలె
చిక్కులు జీరలువారఁ జించెనాతఁడు
తెక్కుల నీ వూరకుండి తెలిగన్నుల నీళ్ళు
గుక్కేవు నీ చేతులేమి కూరగోయఁ బోయెనా

చ. 2:

ముసిముసి నగవుల మోవిమీఁది కెంపులవి
కసిగాటు సేఁతలనే కప్పె నతఁడు
అసురుసురై నీవు అతనిఁజేయఁగలేక
వుసురనేవప్పుడేమి వూరలేక వుంటివా

చ. 3:

కూరిమి నీ కౌఁగిటిలోఁ గూడి నీ చిత్తమనెడి
వూరిలోనఁ గాఁపురమైవుండె నాతఁడు
వేరులేని మహిమల వెంకటేశుఁడతనిమై
చూరగొంటి వప్పుడేమి జోడువెట్టుకుండెనా