పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0027-2 వరాళి-ఏకతాళి సం: 05-151

పల్లవి:

తక్కులచేఁతల మాయదారివట బొంకు-
నిక్కములు నేయనేమి నేరవా యీనీవు

చ. 1:

గుట్టున నూఁదిన పిల్లఁగోవి నీ రవమున
వట్టిమాఁకుల నిగురు వెట్టీనట
పట్టినఁ గందెడి నామై పై పులకలిగురు -
వెట్టఁగా నన్నింత సేయ బెట్ట యీ నీకు

చ. 2:

పాదముచెమటనీరు పరపి దురితముల
సేదదేర నిందరిని జేసీనట
మేదినీధరుఁడ నీ మేని చెమటలతావి-
నాదరించి ననుఁగాచుటరుదా యీ నీకు

చ. 3:

అల నీమదిఁబుట్టిన అంగజుడు లోకులను
చెలరేఁగి కాఁపురాలు సేయించీనట
కలసి వేంకటేశ్వర కందువరతుల నన్ను
కలకాలమునేలుట ఘనమా యీ నీకు