పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0027-1 రామక్రియ సం: 05-150

పల్లవి:

కొంచెము మాకులము గుణము చంచలము
చెంచతతో నీకు నేల చెప్పవయ్య చలము

చ. 1:

గదరుఁ గస్తూరిమన్ను కమ్మనిమై పూఁత
చెదరిని పట్టునార చీరపాఁత
పదిలమైన పండు ఫలము మామేఁత
ఇదివో నే మెవ్వరికి నేలయ్య రోఁత

చ. 2:

గుబ్బలపై వెడజారు గురుగింజ పేరు
సిబ్బపుఁ జెక్కుల నవ్వుచిక్కుఁ జీరు
మబ్బు మబ్బు నెరుల దిమ్మరి కొప్పుతీరు
గబ్బిచూపు కన్నుల మాకడనేల నోరు

చ. 3:

అడవి లేఁతచిగురదివో మాపరపు
వెడ వెడ నగనే మావింత వొరపు
యెడయక తిరువేంకటేశ మాపై వెరపు
గొడవకూటమి నిన్నుఁ గూడిన మైమరపు