పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0216-3 దేసాళం సంపుటం: 08-093

పల్లవి:

అన్నేసి నాకునాకే ఆడుకోరాదు
యెన్నుకొమ్మీ నామాటలితవైనయపుడు

చ. 1:

అలుకలు దీర్చితివి ఆయములంటితివి
చెలఁగి నీచెప్పినట్టు సేసేమయ్య
చెలపట్టేవేళగాదు సరిదాఁకీనిటమీఁద
తలఁచుకో నామాఁట తతి వచ్చినపుడు

చ. 2:

చేయి మీఁదవేసితివి సిగ్గులెల్లాఁ బాసితివి
ఆయనాయ నీకునడ్డమాడనయ్య
రాయడించే చోటుగాదు రతికెక్కినపుడైనా
చాయకుఁ దెచ్చుకో మాట చవులై నయపుడు

చ. 3:

కన్నులనే నవ్వితివి కాఁగిటఁ గూడితివి
మిన్నకైనా నిన్ను సారె మెచ్చేనయ్య
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్‌‌మంగను నేను
వన్నెకుఁ దెచ్చుకో మాట వహికెక్కినపుడు