పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-2 నాదరామక్రియ సంపుటం: 08-008

పల్లవి:

వింత వింత సతులాల వినరమ్మా
యెంతలేదు మీ కెల్లా నిదెచాలు సుండి

చ. 1:

చనవేమెరతుఁగాని చలము సాదింపనోప
చెనకీనంటా నేల చేయి వట్టీనే
కనుసన్న మెలఁగేటి కాంతను నాకీపాటి
కొనగోరుదాఁకించిన కొమ్మలకేపాటో

చ. 2:

యిచ్చకమూడుదుఁగాని యీసడించ నెన్నఁడును
తుచ్చమాడకుండా నాన తూరిపట్టీనే
మచ్చికైన సతిని నామాటలకే యింతసేసె
హెచ్చి తన్నుఁ దిట్టేవారినెంత సేసునో

చ. 3:

గక్కనఁ గూడితిఁగాని కాఁకలు సేయనెప్పుడు
వెక్కసించీఁ జన్నులంటా వేల మొ(నొ?)క్కీనే
వొక్కటైన నాతో నవ్వీ వూరకే శ్రీవేంకటేశుఁ
డిక్కువలనున్నవారినెంత నవ్వునో